రోజురోజుకు దేశంలో చలి తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా దిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. తెల్లవారుజామునే పొగ మంచు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఇక దిల్లీలో గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా తయారైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337గా నమోదైంది. వాయు కాలుష్యం పెరిగిపోవడంతో నగరంపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఈ పొగ మంచు వల్ల సరిగ్గా రహదారులు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ప్రస్తుతం దిల్లీలో గాలి నాణ్యత 337గా నమోదవ్వడంతో అక్కడ గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ దిల్లీలోని లోధి రోడ్, సఫ్దర్‌గంజ్, ఎయిర్‌పోర్ట్ ఫ్లైవోవర్, ఎయిమ్స్ ఏరియాలను పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఆ వైపున వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.