అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతోంది. మరో 24 గంటల్లో బాలరాముడు తొలి పూజనందుకోనున్నాడు. ఈ ప్రారంభోత్సవ మహోత్సవానికి, ఆ తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించనున్నారు. ఇందుకోసం నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు సామాజిక వంటశాలలను ఏర్పాటు చేశాయి. రాం కీ రసోయ్ నుంచి లంగర్ వరకూ వంట శాలలను ఏర్పాటు చేసినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. అయోధ్యలోని ప్రతి వీధిలో ఇవి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కిచిడీ, ఆలూ పూరీ, కధీ చావల్, ఆచార్, పాపడ్‌లను అయోధ్యకు వచ్చే భక్తులకు అందించనున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో వేడి టీనీ భక్తులకు ఇవ్వనున్నారు. బాబా హర్జీత్‌సింగ్ రసూల్‌పుర్ నేతృత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూపు శుక్రవారం అయోధ్య చేరుకుంది. ఛార్‌ధామ్ మఠ్‌లో వారు 2 నెలలపాటు లంగర్‌ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తారు. పట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్టు రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రాం కీ రసోయ్ వంట గదిని సిద్ధం చేసింది. మరోవైపు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసిన ఇస్కాన్ రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది.