జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పులు వంటి అంశాలే అజెండాగా జీ20 సదస్సు సాగనుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే జీ-20లో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కర్తవ్యపథ్, ఇండియా గేట్ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను అధికారులు నిషేధించారు. వచ్చే మూడు రోజుల్లో దిల్లీ విమానాశ్రయ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాస సర్వీసులను రద్దు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌ను మోహరించారు.