నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌.. కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కేంద్రం

-

క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్రప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడం కష్టమని ఇప్ప‌టికే సంకేతాలిచ్చింది. ఈ క్ర‌మంలోనే గురువారం జీఎస్టీ కౌన్సిల్‌ 41 సమావేశం జరుగనుంది. వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా రాష్ట్రాలకు బకాయిలు, పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. కాగా, కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమేనని విప‌క్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నాయి.

ఇందులో ప్ర‌ధానంగా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిపడుతున్నాయి. ఇక్క‌డ ఒక విష‌యం ఏమిటంటే.. 2019-20 ఆర్థిక ఏడాదికిగాను రూ.1,65,302 కోట్ల నష్ట పరిహారం కేంద్రం ఇప్పటికే రాష్ట్రాల‌కు చెల్లించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు విడతల పరిహారాన్ని మాత్రమం ఇప్పటికీ ఇవ్వలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఈసారి జీఎస్టీ బకాయి చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే గతంలోనే చెప్పిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కొంతైనా ఆర్థిక‌ పరిపుష్ఠం చేసుకునేందుకు జీఎస్టీ రేట్లను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ వస్తు ఉత్పత్తులపై పన్నుల భారం మోపే అవ‌కాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత కరోనా విప‌త్క‌ర పరిస్థితుల‌ నుంచి గట్టేక్కెందుకు రాష్ట్రాలు మార్కెట్‌ నుంచి మరింతగా రుణం తీసుకోవడానికి అనుమతించడం.. బాకాయి సెస్‌ కింద వచ్చే వస్తువుల సంఖ్యను పెంచడం.. సెస్‌ను పెంచడం.. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ తదితర నిర్ణయాలు జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news