రాజుగారి గెలుపునకు బాబు సాయం…రాజీనామాకు రెడీనా..?

-

రఘురామకృష్ణంరాజు…గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అయిన పేరు. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచే ఆ పార్టీకే చుక్కలు చూపిస్తున్నారు. అసలు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై రాజుగారు విమర్శస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారో తెలియదు గానీ, మీడియా సమావేశం మాత్రం పెట్టి వైసీపీ నేతలని చెడుగుడు ఆడుకుంటున్నారు. అయితే మా పార్టీ నుంచి గెలిచి మమ్మలనే తిడతావని వైసీపీ నేతలు, రాజు గారిపై తెగ ఫైర్ అవుతున్నారు. అలాగే దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మాట్లాడు అని సవాళ్ళు విసురుతున్నారు.

ఇక వైసీపీ నేతలు ఎంత రెచ్చిపోతే అంతకంటే ఎక్కువగానే రాజుగారు వారికి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే మొన్నటివరకు రాజీనామా చేయను అని గట్టిగా చెప్పిన ఎంపీ, తాజాగా మాత్రం రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి చెబితే నన్ను రాజీనామా చేయాలంటారా ? రాజీనామా చేస్తే ఏమవుతుంది… మూడు రెట్లు ఎక్కువ మెజార్టీతో గెలుస్తా ’ అని మాట్లాడారు. రాజీనామా చేస్తే రాజుగారు ఏ పార్టీ నుంచి నిలబడి మూడు రేట్లు ఎక్కువ మెజారిటీతో గెలుస్తారనేది ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, ఆయన వైసీపీకి ప్రత్యర్ధిగా నిలబడతారు. పైగా బీజేపీ-జనసేనలతో మంచి రిలేషన్ ఉంది కాబట్టి, వారి తరుపున బరిలో దిగే అవకాశాలున్నాయి.

అలా అని ఆ పార్టీల తరుపున పోటీ చేసిన రాజుగారి గెలుపు సాధ్యం కాదు. రాజుగారికి తప్పనిసరిగా చంద్రబాబు సపోర్ట్ ఉండాలి. అప్పుడే ఆయన అనుకున్న విజయం సాధ్యమవుతుంది. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో రఘు…టీడీపీ అభ్యర్ధి శివరామరాజుపై కేవలం 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే వైసీపీకి దాదాపు 4 లక్షల 47 వేల ఓట్లు వస్తే, టీడీపీకి 4 లక్షల 15 వేలు వచ్చాయి. అలాగే జనసేనకు 2 లక్షల 50 వేలు వచ్చాయి. బీజేపీకి ఓ 12 వేలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ సెపరేట్‌గా బరిలో ఉండి, రాజుగారు టీడీపీ, జనసేన, బీజేపీ సపోర్ట్‌తో బరిలో దిగితే న‌రసాపురం రేసు ఆస‌క్తిగా మార‌డం ఖాయ‌మే అని… అందుకే ర‌ఘురామ‌లో ఇప్పుడు కొత్త ధీమా వ‌చ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news