గత రెండు నెలలుగా సూర్యుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. దేశంలో హీట్ వేవ్ ముగిసిందని తెలిపింది. నేటి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. ఈ కబురుతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక నుంచైనా ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“దేశంలో హీట్ వేవ్ ముగిసింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాజస్థాన్, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, చండీగఢ్‌లో తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశాం. రాబోయే 2-3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఆర్‌కే జెనామణి తెలిపారు.
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 24,25,26 తేదీల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.