కరోనా నేపథ్యంలో కొద్ది నెలల కిందట ప్రజలు మాస్క్‌లు లేకుండా బయటకు వచ్చేవారు కాదు. కఠినమైన నిబంధనలను కూడా పాటించారు. అయితే వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభం కావడం, కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా లేదులే అని చెప్పి మాస్కులను ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే అక్కడి ఎమ్మెల్యేలు మాస్క్‌లు లేకుండా కనిపిస్తున్నారు. ప్రశ్నిస్తే.. మాస్క్‌లు అవసరం లేదని.. స్పష్టంగా సమాధానం చెబుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ మాట్లాడుతూ.. కరోనా లేనేలేదు, నేనెప్పుడూ మాస్క్ పెట్టుకోలేదు, ఇకపై పెట్టుకోను, ఫైన్ వేస్తే చెల్లించేందుకు కూడా రెడీ.. అని అన్నారు. ఇక బాజీనాథ్ కుష్‌వాహా అనే మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేను రోజూ 4 జొన్న రొట్టెలు తింటా, కరోనా నన్నేమీ చేయలేదు.. అని అన్నారు.
బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి మాస్క్ లేకుండా కనిపించారు. అడిగితే.. తనకు ఊపిరి ఆడడం లేదని, అందువల్లే మాస్క్ ను తీసేశానని చెప్పారు. ఇలా మధ్యప్రదేశ్‌లో సాక్షాత్తూ ప్రజా ప్రతినిధులే కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తూ తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఫిబ్రవరి 21వ తేదీన మధ్యప్రదేశ్‌లో మొత్తం 299 కరోనా కేసులు నమోదు అవగా 4 మంది చనిపోయారు. అక్కడ ఇప్పటి వరకు 2,59,427 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,854 మంది చనిపోయారు. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇప్పటి వరకు 58,756 కేసులు నమోదు కాగా, భోపాల్‌లో 43,617 కేసులు నమోదయ్యాయి.