పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని, సామాజిక మాధ్యమాలను “బ్లాక్” చేసింది పాక్ ప్రభుత్వం. దీంతో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునేలా, నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని “పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అధారిటీ” కి విజ్ఞప్తి చేసింది “ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్”. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మక రూపు దాల్చేలా కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు “పిటిఐ” నేతలు.
ఇక తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు “పిటిఐ” పార్టీ ఉపాధ్యక్షుడు షా మొహమ్మద్ ఖురేషి నేతృత్వంలోని ఆరుగురు సీనియర్ నేతలతో ఏర్పాటైన కమిటీ. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, గుజ్రాన్ వాలా, ముల్తాన్, పెషావర్, మర్దాన్ నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇస్తామాబాద్ హైకోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు “పిటిఐ” నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు. ఈ నిరసనల్లో భాగంగా 25 పోలీసుల వాహనాలు, 14 ప్రభుత్వ భవనాలను దగ్ధం చేశారు. ఈ నిరసనల్లో 130 మంది పోలీసులకి గాయాలయ్యాయి.