సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఔట్సోర్సింగ్ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. గత 13 రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారని.. వీరి సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటిపోయిందన్నారు. మృతి చెందిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.
మహిళా పంచాయతీ కార్యదర్శులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని లేఖలో కోరారు. పంచాయతీ కార్యదర్శులవి అన్ని న్యాయమైన డిమాండ్ లేనని.. తక్షణమే వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వమే సమ్మె విరమించి ఉద్యోగాలలో చేరకుంటే వారిని విధుల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.