కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక దేశంలో నిర్వహించబడిన మొదటి అతి పెద్ద ఎలక్షన్ అంటే.. బీహార్ ఎన్నికలే. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల పోరాటం కొనసాగింది. అయితే అందరూ ఆర్‌జేడీ గెలిచి అధికారంలోకి వస్తుందనుకున్నారు కానీ నితీష్ కుమార్ మళ్లీ గెలిచి సీఎం అయ్యారు. ఎన్‌డీఏ కూటమిలో భాగంగా ఆయన మరోసారి సీఎం పదవి చేపట్టారు. ఇక వచ్చే ఏడాది కూడా దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వేడి ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
2021లో దేశంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అస్సాం…
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2021లో జరగనున్నాయి. 2016లో ఈ రాష్ట్రంలో సర్బానంద ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు అక్కడ 2001 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇక ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేది అక్కడ ఆసక్తికరంగా మారింది.
కేరళ…
కేరళలో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2016లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు 47 సీట్లు వచ్చాయి.
తమిళనాడు…
దేశంలో తమిళనాడు రాజకీయాలు కూడా ఆసక్తికరంగానే సాగుతాయి. మే 2021లో అక్కడ 234 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేకుండా జరనున్న తొలి ఎన్నికలు అవి కావడంతో ఈసారి అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారోనని అందరూ ఇప్పటి నుంచే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అక్కడ కరుణానిధి, జయలలిత ఇద్దరికీ ఎప్పుడూ పోటీ ఉండేది. కానీ ఈసారి ఆమె లేదు. దీంతో సీఎం పదవి ఈసారి ఎవరిని వరిస్తుందో చూడాలి.
పశ్చిమ బెంగాల్…
పశ్చిమ బెంగాల్‌లో 2021లో 294 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2016లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి బీజేపీ గట్టిపోటీనిస్తామని భావిస్తోంది.
జమ్మూ కాశ్మీర్…
జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అయిన సంగతి తెలిసిందే. అక్కడ 2021లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తం 87 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.