ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో అల్లర్లు.. ఇటీవల జరిగిన అమానవీయ ఘటన.. ఆ తర్వాత చోటుచేసుకుంటున్న సంఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ పార్లమెంట్ ముందు ప్లకార్డులు చేత పట్టుకుని ఆందోళనకు దిగాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విపక్షాలు మణిపుర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. దీనిపై చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ.. చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్.. రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు.. లోక్‌సభలో సెషన్ ప్రారంభం కాగానే మణిపుర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్ష కూటమి(ఇండియా) సభ్యులు పట్టుబట్టారు.’ఇండియా ఫర్ మణిపుర్’, ‘మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి’ అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల మధ్యే లోక్ సభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.