ఈ వేసవిలో 28 శాతం అధిక వర్షపాతం : ఐఎండీ

-

ఈ ఏడాది సీజన్లన్నీ లయతప్పుతున్నాయి. వర్షాకాలంలో ఎండలు.. వేసవిలో వర్షాలు.. ఇక చలికాలంలోనూ వానలు. ఇలా సీజన్​తో సంబంధం లేకుండా వర్షాలు కురిసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ముఖ్యంగా వేసవిలో తరచూ వానలు కురుస్తూ రైతులను అష్టకష్టాలు పెడుతున్నాయి. అయితే ఈ ఏడాది వేసవిలో సాధారణం కన్నా 28 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల సీజన్‌కు ముందు.. మార్చి 1 నుంచి ఈ నెల 3 వరకూ మధ్యభారత దేశంలో 268 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయని వెల్లడించింది.

తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం 29 శాతం లోటు కనిపించింది. దక్షిణాదితో కూడిన ద్వీపకల్ప భాగంలో 88 శాతం, మధ్య భారత దేశంలో 18.2 శాతం, పంజాబ్‌, హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలతో కూడిన వాయవ్య భారత దేశంలో 18 శాతం మేర అధికంగా వానలు కరిశాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్‌ 21-22 నుంచి చాలాచోట్ల వర్షాలు ఎక్కువగా పడ్డాయని వివరించింది. దీనివల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. గత నెల 21 నుంచి దేశంలో ఎక్కడా వడగాల్పులు తలెత్తలేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news