అమెరికాను ఇప్పుడు ఇండియా మించిపోయింది – విజయసాయి రెడ్డి

-

అమెరికాను ఇప్పుడు ఇండియా మించిపోయిందన్నారు విజయసాయి రెడ్డి. దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కిందటేడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంకా, బియ్యం ఎగుమతులపై షరతులతో కూడిన ఆంక్షలు అమలుచేస్తోంది. 2022 సెప్టెంబరులో బియ్యం నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించిందని పేర్కొన్నారు.


గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 2023–2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్‌ సీజన్‌ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసిందన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం అయిన ఇండియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారధాన్యాల తీవ్ర కొరత ఎదుర్కొన్న దేశం ఇండియా. అలాంటిది ఈ 75 ఏళ్లలో గోధుమలు, వరి బియ్యం తదితర ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచగలగడమేగాక వరి, గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్‌ సేనల కోసం నాటి ఇంగ్లండ్‌ ప్రధాని విన్‌ స్టన్‌ చర్చిల్‌ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్‌ లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news