పాక్ స్థావరాలపై భారత్ పంజా.. 8 మంది శత్రు సైనికులు హతం..!

-

దేశం మొత్తం దీపావళి సంబరాలకు సన్నద్ధమవుతున్న వేళ పాక్‌ దుస్సాహసానికి ఒడిగట్టింది. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టిన దాయాది కంగుతింది. నిప్పుతో చెలగాటమాడి.. చేతులు కాల్చుకుంది. దాయాది దురాగతానికి భారత్‌ దీటుగా బదులిచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో.. ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు దిగింది. ఇందులో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా 11 మంది బలయ్యారు. దీంతో భారత సేన సింహంలా గర్జించింది. శత్రు దేశం సైనిక శిబిరాలపై శతఘ్నలు, రాకెట్లు, ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణులతో నిప్పులవాన కురిపించింది.

భారత సైనిక ప్రతిఘటన ధాటికి శత్రు స్థావరాలు పేకమేడల్లా నేలకూలాయి. ఇందులో 8 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. మన ఆయుధాలు పాక్ పటిష్ట బంకర్లను ధ్వంసం చేస్తున్న వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. ఒక వీడియోలో.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఒక పర్వత పంక్తిపై ఉన్న కాంక్రీటు బంకర్‌ కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత అది మొత్తం ధ్వంసమైంది. భారీ ధూళి మేఘం ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. మరో వీడియోలో.. సర్రున దూసుకొచ్చిన ఒక ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణి సరాసరి ఒక బంకర్‌ను ఢీ కొట్టింది. కొన్ని సెకన్ల తర్వాత మరో రెండు క్షిపణులు వచ్చి ఆ బంకర్‌ను ధ్వంసం చేశాయి.

‘‘భారత్ ప్రతిదాడిలో సైనిక శిబిరాలతోపాటు ఆయుధ డిపోలు, ఇంధన డంప్‌లు, ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి. శుక్రవారం నాడు పాక్ సైన్యం ఉద్దేశపూర్వకంగా భారత్‌లోని పౌరుల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఇందులో నలుగురు సైనికులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక ఎస్ఐ, ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భద్రతా సిబ్బంది, 8 మంది పౌరులు గాయపడ్డారు. ఇందులో అమరులైన సైనికులకు ఈ దేశం వందనం సమర్పిస్తోంది.’’ అని సైనిక అధికార ప్రతినిధి కర్నల్‌ రాజేశ్‌ కాలియా చెప్పారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించేందుకు పాక్‌ సైనికులు చేసిన ప్రయత్నాన్ని మన బలగాలు అడ్డుకున్నాయి.

ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడుతున్నప్పటికీ పాక్‌ తన దుష్ట ప్రయత్నాలను ఆపడంలేదు. భారత సైనిక బలగాలు చూపిన ధైర్యసాహసాలను కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కొనియాడారు. మరోవైపు ఈ వ్యవహారంలో తప్పంతా భారత్‌దే అన్నట్లు పాక్‌ బుకాయిస్తూ, నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. ఇస్లామాబాద్‌లోని భారత సీనియర్‌ దౌత్యాధికారిని పిలిపించి, నిరసన తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news