తమిళనాడులో ప్రముఖ ఫైనాన్షియర్, చిత్ర నిర్మాత అన్బు చెళియన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. చెన్నై, మధురై సహా ఆ రాష్ట్రంలోని మొత్తం 10 చోట్ల అన్బుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేశారు.
అన్బు చెళియన్.. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫైనాన్షియర్. విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్కు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారు. గోపురం ఫిలింస్ అనే బ్యానర్‌పై కొన్ని సినిమాలు నిర్మించారు.
2020 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో అన్బు చెళియన్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నై, మధురైలోని నివాసాల నుంచి రూ.50కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్బు చెళియన్ స్నేహితుడు శరవణన్ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. మధురైలోని నివాసం నుంచి రూ.15కోట్లు జప్తు చేశారు. అదే సమయంలో హీరో విజయ్ ఇళ్లలోనూ సోదాలు జరిపి, ఆయన్ను ప్రశ్నించారు.