కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం అప్రమత్తమైంది. భద్రతాబలగాలను హై అలర్ట్ చేసింది. వరుస ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది.
జవాన్ల కాన్వాయ్‌లపై దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించినట్లు సమాచారం. మరోవైపు అమర్‌నాథ్ యాత్ర వాహనాలపైనా ఆంక్షలు విధించింది. జమ్ములో దాడి ముప్పు పొంచి ఉందని.. ఏ క్షణం ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయో తెలియనుందున బలగాలు ఒంటరిగా సంచరించొద్దని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు భద్రతా బలగాలను తరలించి.. తొలిసారి అసోం రైఫిల్స్‌ను ఈ ప్రాంతంలో మోహరించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.