కేరళ జర్నలిస్టు సిద్ధీఖ్ కప్పన్ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ జైలులో ఉన్న కప్పన్ విడుదల ఉత్తర్వులను బుధవారం రాత్రి జైలు యంత్రాంగం అందుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు కోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. చట్టపరమైన అన్ని కార్యకలాపాలను పూర్తి చేసిన తర్వాత కప్పన్‌ను విడుదల చేసినట్లు జిల్లా జైలు సూపరింటెండెంట్ అధికారి ఆశిష్ తివారీ తెలిపారు.
2020 సెప్టెంబరు 14న ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు అక్టోబర్ 5న జర్నిలిస్టు కప్పన్ అక్కడికి బయల్దేరారు. మార్గమధ్యలో యూపీ పోలీసులు కప్పన్‌ను చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. కప్పన్ బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనానికి దరఖాస్తు చేసుకున్నారు. అతడి అప్పీలును లఖ్‌నవూ బెంచి కొట్టివేయటం వల్ల కప్పన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.