దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల మాదిరే కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది కూడా చాలా ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు కన్నడ నాట సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ గద్దెనెక్కారు. వారితో పాటు ఇటీవల ఎనిమిది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అయితే వీరితోపాటు మరో 25 మంత్రులు కన్నడ కేబినెట్లో ఉండాల్సి ఉండగా.. మే 19న కేబినెట్ కూర్పుపై అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది.
అయితే సిద్ధరామయ్య, డీకేల మధ్య విభేదాల కారణంగా మంత్రుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ పంచాయితీ కాస్త దిల్లీకి చేరింది. ఎట్టకేలకు హై కమాండ్ చొరవతో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు 24 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించలేదు. రేపు మంత్రి వర్గ విస్తరణ తర్వాత శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.