ఎన్నికల ప్రచారానికి సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో ఈరోజు (జూన్ 2వ తేదీ) తిహాడ్ జైల్లో లొంగిపోతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే లొంగిపోయే ముందు రాజ్ ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని, కన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఆదివారం ఉదయం కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇచ్చారు.
‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతాను. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను, అక్కడ నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమంతుని ఆశీర్వాదం తీసుకుంటాను. అనంతరం పార్టీ ఆఫీస్‌కి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి అటు నుంచి తిహాడ్‌కు వెళ్తాను. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ ముఖ్యమంత్రి జైల్లో సంతోషంగా ఉండగలుగుతాడు’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.