దిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ వేగవంతం చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే నోటీసులు ఎదుర్కొన్న పలువురు ప్రముఖులు మాత్రం వివిధ రకాల కారణాలతో ఈడీ విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈ కేసులో పలుమార్లు ఈడీ సమన్లు అందుకున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా నాలుగోసారి గైర్హాజరయ్యారు. తర్వలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నందున తాను విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దిల్లీలో ఈరోజు విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో పాల్గొన్న తర్వాత ఆయన గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు.