మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు జూన్ 5న నిర్ణయం తీసుకోనుంది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రివాల్ రేపు జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిఉంది. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్ధనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. నేటితో ఆ బెయిల్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజీవాల్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దానిపై ఈ రోజు విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ కు ఈడీ బెయిల్ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి. తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు.