పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కేరళలో అధికార సీపీఎం తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా15 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో మాజీ మంత్రులు కేకే శైలజ, టీఎం థామస్ ఐజక్ ఉన్నారు. ఈ మేరకు సీపీఎం కేరళ కార్యదర్శి ఎంవీ గోవిందన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ముఖ్యంగా కేరళలో శైలజ టీచర్‌గా పేరొందిన మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ లోక్‌సభ బరిలో నిలవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. శైలజ టీచర్ వడకర నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. మరో మాజీ మంత్రి థామస్ పతనంథిట్ట నుంచి బరిలో దిగనున్నారు. కేకే శైలజ ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలో కరోనా, నిఫా వంటి కష్టకాలంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.