దేశంలో పనికి రాని పాత చట్టాలని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దేశ ప్రజలకు అంతగా ఉపయోగంలో లేని పురాతన చట్టాలను త్వరలోనే తొలగిస్తామని తెలిపారు. కొన్ని చట్టాలు ప్రజలకు, వ్యవస్థకు అసౌకర్యంగా తయారయ్యాయని ఈ చట్టాలను తొలగించి ప్రజలకు ప్రశాంత జీవనం అందించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని ఆయన చెప్పారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
కొన్ని చట్టాలు ప్రజల జీవితాలపై భారంగా మారుతున్నాయని కిరణ్ రిజిజు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు సరిపోని, ప్రజలకు అవసరం లేని పురాతన చట్టాలు ఉండికూడా ఎలాంటి లాభం లేనందున వాటిని తొలగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు భారంగా తయారైన అనేక చట్టాలను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇలాంటి 1500 చట్టాలను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.