కువైట్‌ నుంచి కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

-

రెండు రోజుల క్రితం కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 49 మృతి చెందగా 45 మంది అందులో భారతీయులే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలు ఈరోజు (జూన్ 14వ తేదీ) ఉదయం భారత్​కు చేరుకున్నాయి. ఐఏఎఫ్​కు చెందిన ప్రత్యేక విమానం 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు.

కొచ్చి విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు కే రాజన్‌, పీ రాజీవ్‌, వీణా జార్జ్‌ భారతీయుల 45 మృతదేహాలను స్వీకరించారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోడియం వద్ద మృతదేహాలకు సీఎం, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు. కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి భారత్ గురువారం రాత్రి సైనిక రవాణా విమానాన్ని పంపగా.. కేరళకు చెందిన 23, తమిళనాడుకు 7, కర్ణాటకకు చెందిన ఒక మృతదేహం సహా ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 14 మృతదేహాలతో కొచ్చి విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం చేరుకుంది. కాగా, బాధితుల మృతదేహాలను వారి ఇళ్లకు అంబులెన్స్​లో అధికారులు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news