ఒక్కసారి కరోనా పాజిటివ్ అని తేలిందంటే.. గుండె జారినంత పనైతుంది. కానీ.. ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె పరీక్ష చేసుకున్నా ప్రతిసారి పాజిటివ్ వస్తుండటంతో వైద్యులే నివ్వెరపోయారు. లక్షణాలే లేకున్నా పాజిటివ్ వస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఆమె నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నారు.
పూర్తి ఆరోగ్యంగా..
రాజస్థాన్‌లోని అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారద కాస్త అలసటగా ఉండటంతో మొదటి సారి కరోనా పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ వచ్చింది. అయినా ఆమెకు కరోనాకు సంబం«ధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమెను భరత్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 20న తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యుడు భరద్వాజ్ తెలిపాడు. అలా ఇప్పటి వరకు 31 సార్లు పరీక్షలు చేయగా పాజిటివ్ రావడమే కన్పించింది. మొదట్లో శారదా నిలబడేందుకు కూడా ఓపిక ఉండేది కాదు.. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది.
8 కిలోల బరువు పెరిగింది..
గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. మరో ఆశ్యర్యమేమిటంటే ఆమె అదనంగా 8 కిలోల బరువు పెరగి వైద్యులలే ముక్కులో వేలేసుకునేటట్టు చేస్తోంది. తొలిసారి వచ్చిన వైరస్ చికిత్స తీసుకున్నా, శరీరంలో ఉంటుందని.. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించినప్పుడల్లా పాజిటివ్ వస్తుందని వైద్యులు అనుమానిస్తున్నారు. శారదా కడుపు భాగంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండడంతో ఇలా జరగడానికి కూడా అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.