దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్‌లో 223 మంది తొలగింపు

-

దేశ రాజధానిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ మహిళా కమిషన్‌లో 223 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ దిల్లీ ఎల్జీ కార్యాలయం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ నిబంధనలను ఉల్లంఘించి మరీ వీరిని నియమించారని అందులో ఆరోపించారు.

చట్ట ప్రకారం దిల్లీ మహిళా కమిషన్‌లో 40 పోస్టులను మాత్రమే కేటాయించారని, కానీ, మాజీ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 223 కొత్త ఉద్యోగాలను సృష్టించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కింద వీరిని నియమించుకున్నారని.. అయితే, ఒప్పంద నియామకాలు చేపట్టేందుకు కమిషన్‌కు అధికారం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వంపై అదనపు భారం మోపే నిర్ణయాలను కమిషన్‌ తీసుకోకూడదని ఎల్జీ కార్యాలయం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news