ఎన్నో ఏళ్లుగా ప్రతి హిందువు ఎదురుచూసిన తరుణం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరో పదిరోజుల్లో కన్నులపండువగా జరగనుంది. ఇప్పటికే అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర ప్రముఖులను ఆహ్వానించింది రామ జన్మభూమి ట్రస్ట్. ఇందులో భాగంగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అడ్వాణీకి కూడా ఆహ్వానం పంపింది.
అయితే ఆయన వృద్ధాప్య సమస్యల దృష్ట్యా ఈ అద్భుత కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. తాజాగా దీనిపై విశ్వ హిందూ పరిషత్ స్పష్టతనిచ్చింది. అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎల్కే అడ్వాణీ కచ్చితంగా హాజరవుతారని తెలిపింది. మురళీ మనోహర్ జోషి హాజరవుతారో, లేదో అనే అంశంపై మాత్రం స్పష్టత లేదని వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్ వెల్లడించారు. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవానికి అడ్వాణీ హాజరవుతారని అవసరమైతే ఆయన కోసం తాము ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆలోక్ కుమార్ చెప్పారు.