దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇటీవలే తొలి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక నేడు లోక్‌సభ ఎన్నికలకు రెండో విడత నోటిఫికేషన్ జారీ కానుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రెండో విడతలో నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 4 వరకు గడువు ఉంది. ఏప్రిల్ 5వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 8వ తేదీ ఉపసంహరణకు ఆఖరు తేదీ అని ఈసీ ప్రకటించింది. ఇక ఏప్రిల్ 26వ తేదీ రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే తొలి దశ నోటిఫికేషన్ జారీ అయింది. ఇక ఈరోజు రెండో విడత నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ 19, 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న పోలింగ్ నిర్వహించనున్నారు. 22 రాష్ట్రాల్లో ఒకే విడతలో, నాలుగు రాష్ట్రాల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్, అసోంలో మూడు విడతల్లో, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో నాలుగు విడతల్లో, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు విడతల్లో, యూపీ, బిహార్, బంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.