మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యానగర్‌గా మారుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రకటన చేశారు. ఇంతకు ముందు కూడా ఈ సర్కార్ ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా.. ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా అహ్మద్‌నగర్‌ను అహల్యానగర్‌గా పిలవాలని సీఎం షిండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా ఆమె గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిందే తెలిపారు.
“అహల్యా బాయి సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయవాదిగా రాణి అహల్యాబాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించారు. ఆమె లేకుంటే మనకు ఈరోజు కాశీలో మహాశివుడి గుడి ఉండేది కాదు. అందుకే అహ్మద్‌నగర్‌కు ఆమె పేరు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.