జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో ఇటీవలే ఇంటర్నెట్ పునరుద్ధరించారు. ఇంటర్నెట్ పునఃప్రారంభమైన తర్వాత అల్లర్ల సమయంలో ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ అల్లర్లలో కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుతం వీరి మృతదేహాల ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు తెలిపింది. జులై 6 నుంచి వీరిద్దరూ అదృశ్యమయ్యారు.
ఫొటోలు వైరల్ కావడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఆ ఫొటోలో కనిపించింది. మరో ఫొటోలో వారి వెనక ఇద్దరు సాయుధులు కనిపించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ కావడంతో మణిపుర్‌లో మరోసారి దుమారం రేగింది.