భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలో ఎప్పుడూ రాజ్యాంగం చదివి ఉండరని అందుకే ఆ పుస్తకం ఆయనకు ఖాళీగా కనిపిస్తుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఖాళీ రాజ్యాంగం పుస్తకాలపై ప్రధాని మోడీ విమర్శలపై రాహుల్ స్పందించారు. వాస్తవానికి రాజ్యాంగం పుస్తకం రంగు కాదు.. అందులో ఏముందన్నదే మాకు ముఖ్యమని తెలిపారు.
దీనిని కొందరూ ఖాలీ పుస్తకం అంటున్నారంటే.. బిర్సా ముండా, అంబేద్కర్, గాంధీని అవమానించినట్టే. ఇది ఖాలీ పుస్తకం కాదు.. వేల ఏళ్ల ఆలోచన అని పేర్కొన్నారు. దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, రైతులు, కూలీలు, ఇంతవరకు ఏం పొందారో అవన్ని వారికి రాజ్యాంగం వల్లనే లభించాయన్నారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని తెలిపారు. అన్ని వర్గాలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో కులగణన సర్వే చేపడుతున్నామని చెప్పారు.