Gujarat Elections : మోర్బీ బాధితులను కాపాడిన వ్యక్తికి బీజేపీ టికెట్

-

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 160 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఓ ఇంట్రెస్టింగ్ వ్యక్తికి టికెట్ ఇచ్చింది కాషాయపార్టీ. ఇటీవల మోర్బీ ఘటనతో ఇరకాటంలో పడిన కమలం పార్టీ అక్కడ నిలబెట్టిన అభ్యర్థి వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజా, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్దిక్‌ పటేల్‌కు టికెట్లు దక్కాయి.

గత నెల చివర్లో గుజరాత్‌లోని మోర్బీ నగరంలో గల మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి  కూలిపోవడంతో సుమారు 140 మంది మృతి చెందారు. ఎన్నికల వేళ జరిగిన ఈ దుర్ఘటన.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. దాంతో ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక విషయంలో కమలం పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది.

ఈ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్‌ అమృతియా(60)ను బరిలోకి దింపింది. ఆయన కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన సమయంలో నదిలో దూకి పలువురి ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోల్లో.. ఆయన లైఫ్ ట్యూబ్ ధరించి నదిలో పడిపోయిన వారిని రక్షిస్తున్నట్లు కన్పించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాలో తొలుత కాంతిలాల్‌ పేరు లేనప్పటికీ, నదిలోకి దూకి ఆయన చేసిన సాహసమే టికెట్‌ దక్కేందుకు కారణమైందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news