కోవిడ్ ఎఫెక్ట్‌.. ఈఎంఐలు చెల్లించ‌లేని వారి సంఖ్య భారీగా పెరుగుతోంది..!

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న రుణ చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రు చేస్తున్న ఉద్యోగాల‌ను, ఉపాధిని పోగొట్టుకుని రుణాలు చెల్లించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుంటే, చిన్న, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారులు వ్యాపారం స‌రిగ్గా జ‌ర‌గ‌క రుణాలు చెల్లించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా వ‌ల్ల ఈఎంఐలు చెల్లించ‌లేక‌పోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుంద‌ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్ల‌డించింది.

ఎన్‌పీసీఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దేశంలో మార్చి నెల వ‌ర‌కు ఈఎంఐలు చెల్లించ‌లేక చెక్ బౌన్సులు అయిన వారి సంఖ్య 32.8 శాతం ఉండ‌గా అది ఏప్రిల్ నెల‌లో కొద్దిగా పెరిగి 34.1 శాతానికి చేరుకుంది. ఎన్ఏసీహెచ్ ఫెయిల్ అయిన లావాదేవీల‌ను మాత్ర‌మే లెక్కించారు. అంటే క్రెడిట్ కార్డుల వంటి చెల్లింపులను ఇందులో లెక్కించ‌లేదు. వారిని కూడా లెక్కిస్తే ఆ శాతం ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంది.

కాగా కోవిడ్ సెకండ్ వేవ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి దేశంలో ఈఎంఐలు చెల్లించ‌లేని వారి సంఖ్య పెర‌గ‌డంతోపాటు చెక్ బౌన్సులు కూడా పెరిగిపోయాయి. లాక్‌డౌన్ వ‌ల్ల చాలా మంది ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని సాక్షాత్తూ బ్యాంకులే చెబుతున్నాయి. అనేక మంది రుణాల‌ను చెల్లించ‌లేక‌పోతున్నార‌ని, వారి ఆర్థిక ప‌రిస్థితులు బాగా లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్‌ల‌ను ఇప్ప‌ట్లో ఎత్తేసే ప‌రిస్థితి లేదు కనుక మే, జూన్ నెల‌ల్లో చెక్ బౌన్సుల సంఖ్య ఇంకా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో రుణాలు వ‌సూలు కాక బ్యాంకులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ముందు ముందు ఇంకా ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయోన‌ని అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు.