కన్యాకుమారి లోక్‌సభ బరిలో నరేంద్ర మోదీ….?

-

దక్షిణ భారతదేశంలో విస్తరించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈసారి దక్షిణాదిలో మెరుగైన సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పక్కా కార్యాచరణను అమలు చేస్తోంది. మిత్రపక్షాలకు చెందిన ఎంపీలతో వరుసగా భేటీ అవుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…..కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలిచ్చారు. రక్షాబంధన్‌ రోజున రాఖీతో ముస్లిం మహిళలకు చేరువ కావాలని చెప్పారు. ముస్లిం మహిళల సంక్షేమానికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించాలని సూచించారు.ఆయా వర్గాలకు కేంద్రం ఇస్తున్న పథకాలను వివరించి ఓటర్లను బీజేపీ వైపు మళ్ళించాలని చెప్పారు.

నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ

ఇదిలా ఉండగా దక్షిణాదిలో భారతీయ జనతాపార్టీకి ఊపు తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధమైనట్లు సమాచారం.నాలుగు రాష్ర్టాల్లోని ఏదో ఒక పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచి ఆయన పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.తమిళనాడులోని కన్యాకుమారి స్థానం నుంచి ఆయన బరిలోకి దిగవచ్చని మరికొంతమంది బీజేపీకి చెందిన నేతలు చెప్తున్నారు. ఈ సారి ఎలాగైనా దక్షిణాదిలో మెరుగైన సీట్లు సాధించే లక్ష్యంతో మోడీ అండ్‌ టీమ్‌ రంగంలోకి దిగిందనేది వాస్తవం.ఈ నేపథ్యంలోనే మిత్రపక్షాలతో సీరియస్‌గా సమావేశాలు నిర్వహిస్తూ సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తున్నారు. త్వరలోనే కేరళ,తమిళనాడు, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీలను నియమించే దిశగా కసరత్తు కూడా జరుగుతోంది.

నాలుగు పర్యాయాలు గుజరాత్‌ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు నరేంద్ర మోడీ. 2001లో కేశుభాయ్‌ పటేల్‌ మృతిచెందగా ఆయన స్థానంలో తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు మోడీ.ఆ తరువాత 2002,2007,2012 ఎన్నికలలో వరుసగా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన మోడీ నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.జాతీయస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాక 2014లో వారణాసి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.అప్పట్లో 56 శాతం ఓట్లను పొందిన మోడీ 3 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 2019లో కూడా వారణాసి నుంచే ఆయన బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో మోడీకి 63శాతం ఓట్లు పోల్‌ అయ్యాయి.సమాజ్‌వాది పార్టీ నుంచి పోటీ చేసిన షాలినీ యాదవ్‌పై ఆయన 4 లక్షల 79 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలా రెండో సారి కూడా ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నారు. ఇదే తరహాలో దక్షిణాదిలోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో మోడీ సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా తేలలేదు కానీ ప్రధాని ఏదో ఒక పార్లమెంట్‌ స్ధానం నుంచి బరిలో ఉండటం ఖాయమని బీజేపీ నేతలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news