బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ.3500కోట్ల జరిమానా..!

-

దీదీ సర్కార్ కు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి రూ.3500 కోట్ల జరిమానా విధించింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు గానూ జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాలకు రూ.12,819కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు ఉన్నా.. మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు బెంగాల్‌ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ట్రైబ్యునల్‌ అసహనం వ్యక్తం చేసింది.

‘‘దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఆరోగ్య సంబంధిత సమస్యలను వాయిదా వేయలేం. ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల కొరత కోసం ఎదురుచూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలను ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్‌ ప్రభుత్వం జమ చేయాలి’’ అని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఏకే గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

ఇకనైనా చెత్త నిర్వహణపై బెంగాల్‌ సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news