పాకిస్థాన్ గత కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ దేశాల సాయం కోరుతూ నెట్టుకొస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభవంపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు భారత్ చంద్రుడిని చేరి, జీ20 సమావేశాలను జరిపి అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని వ్యాఖ్యానించారు. పాక్ ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోడానికి దేశంలోని మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమని ఆరోపించారు.
పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రధాని నేడు దేశ విదేశాలు తిరుగుతూ నిధుల కోసం వేడుకొంటున్నారని .. భారత్ సాధించిన ఘనతను పాకిస్థాన్ ఎందుకు సాధించలేకపోయింది? దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. ‘నా ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతోపాటు ఐఎస్‌ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ఉన్నారు. పాక్ ఈ దుస్థితికి చేరుకోడానికి కారణమైన ఈ అధికారులు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ తప్పక విజయం సాధిస్తుంది’ అని నవాజ్ ధీమా వ్యక్తం చేశారు.