దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో ఇప్పటికే చాలా మంది నిపుణులు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను మరోసారి అమలు చేయాలని చెబుతున్నారు. అయితే తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా లాక్‌డౌన్ విధించాలని కోరింది. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితిలో లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గమని ఐఎంఏ అభిప్రాయ పడింది.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల బాధితులకు వైద్యం అందించేందుకు సదుపాయాలు ఉండడం లేదని, తగినంత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా లేరని, దీంతో ఇప్పటికే పనిచేస్తున్న వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, కొందరు వైద్య సిబ్బంది ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ సహజానంద్ ప్రసాద్ సింగ్ అన్నారు. అందువల్ల దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని అన్నారు.
తాను దేశంలోని ఎంతో మంది సీనియర్ డాక్టర్లు, వైద్య నిపుణులతో మాట్లాడానని, అందరూ లాక్‌డౌన్ పెడితేనే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అన్నారు. పాట్నా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ పీకే సింగ్, ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ బిస్వాస్, పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ విద్యాపతి చౌదరి తదితర అనేక మంది నిపుణులతో దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చించానని, అందరూ లాక్ డౌన్ విధిస్తేనే బాగుంటుందని అన్నారని తెలిపారు. దేశంలో 15 రోజుల పాటు లాక్ డౌన్‌ను అమలు చేస్తే కోవిడ్ ను కట్టడి చేయవచ్చని, లేదంటే సంక్షోభం ఇంకా ఎక్కువవుతుందని అన్నారు.