కరోనా వైరస్ ప్రభావం ఇంకా అంతమే కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో థర్డ్ వేవ్ మొదలవ్వగా భారత్ లో సెకండ్ వేవ్ మొదలైనట్లు స్పష్టమవుతుంది. గత కొద్ది రోజులుగా పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. అయితే ఈ ముప్పు ఇంకా పోకముందే మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
అండమాన్ దీవుల్లోని మొత్తం 8 ప్రదేశాల్లో 48 మట్టి, నీరు నమూనాలను యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన సైంటిస్టులు సేకరించారు. ఈ క్రమంలో ఆ శాంపిల్స్ ను పరీక్షించగా వాటిలో సి.ఆరిస్ అనే ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైందని, అండమాన్ దీవుల్లో ఈ ఫంగస్ ఎందుకు కనిపించిందో తెలియదని, కానీ ఇది గతంలో ఒకసారి వ్యాప్తి చెందిందని సైంటిస్టులు తెలిపారు.
ఈ ఫంగస్ మనం ఉపయోగించే యాంటీ ఫంగస్ మెడిసిన్లకు లొంగదు. కానీ మనిషి చర్మంపై ఉంటుంది. గాయాల ద్వారా లోపలికి వెళ్తుంది. ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించేందు కూడా అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ 2009లో ఒక పేషెంట్‌కు సోకినట్లు మొదట గుర్తించారు. తరువాత యూకేలో ఇప్పటి వరకు ఈ ఫంగస్ 270 మందికి సోకింది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని ఈ ఫంగస్ ఉంటుందని, కరోనా తరువాత ఈ ఫంగస్ నుంచే ఎక్కువగా ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు తెలిపారు.
అందువల్ల ఇప్పటి నుంచే ఆ ఫంగస్‌పై పరిశోధనలు చేయాలని సైంటిస్టులు అంటున్నారు. ఇక ఈ ఫంగస్ బారిన పడితే దాంతో జీవితకాలం బాధపడాల్సిందేనని, ఏ మందులు పనిచేయవని, మనిషి నుంచి మనిషికి ఈ ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని తేల్చారు. ఈ క్రమంలోనే సైంటిస్టులు ఈ ఫంగస్ గురించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.