లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తున్నారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు కాగా.. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు.. ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనాకు వచ్చారు.
ఈ సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ.. నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ ఉంటుందని.. ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ తీసుకొస్తామని వెల్లడించారు. వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఉదేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు.