కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ సమర్పించారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైందని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలు గణనీయంగా పెంచామని తెలిపారు.
కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామన్న నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం 4శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామని తెలిపారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఎంఎస్‌ఎంఈ, మధ్యతరగతి కేంద్రంగా బడ్జెట్ ఉందని వెల్లడించారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కూరగాయల ఉత్పత్తికి త్వరలో మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న నిర్మలమ్మ.. వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దగ్గరలోనే కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.