జాతీయ వైద్య కమిషన్ ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ రెగ్యులేషన్-2023’పేరుతో ప్రకటన జారీ చేసింది. వైద్య వృత్తి చేపట్టేందుకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌కి ఇచ్చే అనుమతిని ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలని నిర్దేశించింది. గడువు ముగియడానికి 3 నెలల ముందే ఆ పని చేసుకోవాలని సూచించింది. ఒకవేళ అలా వైద్యుడి నుంచి లైసెన్స్ పునరుద్ధరణ దరఖాస్తు రాకపోతే స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి వారి పేరు తొలగిస్తారు. వారిని ‘ఇన్‌యాక్టివ్’గా ప్రకటిస్తారు. అలాంటి వారు వైద్య వృత్తి చేపట్టడానికి వీల్లేదు.
రాష్ట్ర జాబితాలో ‘ఇన్‌యాక్టివ్’ అని ఉంటే జాతీయ జాబితాలోనూ అలాగే కనిపిస్తుంది. ఒక రాష్ట్ర వైద్య మండలిలో పేరు నమోదుచేసుకున్న వైద్యుడు మరో రాష్ట్రంలో వైద్య వృత్తిచేపట్టాలనుకుంటే.. ఆ రాష్ట్ర ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రాక్టీస్ లైసెన్స్‌ను బదిలీ చేసుకోవాలనుకుంటే అందుకోసం దరఖాస్తు చేసుకోవాలి.