కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మంత్రిత్వ శాఖ తరఫున భారీ నిధులతో పనులు చేపట్టినా అవినీతి మాత్రం జరగలేదన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల వ్యయం దాదాపు పెరగదని.. కాంట్రాక్టర్లు కూడా తనను కలిసేందుకు అనుమతించబోనన్నారు. గురువారం కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు హైవే పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఏటా రూ.ఐదు లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేస్తాం. ఇప్పటివరకు రూ.50 లక్షల కోట్ల విలువైన పనులు చేశా. నన్ను కలవడానికి కాంట్రాక్టర్లను అనుమతించను. జాతీయ రహదారుల పనిలో అవినీతి శూన్యం’’ అని వ్యాఖ్యానించారు.
తన మంత్రిత్వ శాఖ సాంకేతిక, ఆర్థికపరమైన అర్హతలను మెరుగుపరుచుకోవడంతో ప్రాజెక్టు వ్యయం 35శాతం నుంచి 38శాతం కన్నా తక్కువగానే ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. నాణ్యత విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు. పనిలో నాణ్యత విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.