ఒడిశాలోని మహానదిలో ఓ పడవ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలో శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి దాదాపు 48 మంది ప్రయాణికులను రక్షించారు. పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
శుక్రవారం రాత్రి సమయంలో దాదాపు 50 మంది ప్రయాణికులతో పథర్సేని కుడా నుంచి బర్గర్ జిల్లాలోని బంజిపాలి వెళ్తోంది. ఝూర్సుగూడ జిల్లాకు రాగానే పడవ బోల్తా పడింది. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు నదిలోకి దూకి 35 మందిని కాపాడారు. తర్వాత పోలీసులు, సహాయక సిబ్బంది మరి కొంత మందిని రక్షించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.