ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆరంభానికి ముందే వివాదాలకు తెర తీస్తోంది. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్‌ను ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని పేర్కొన్నాయి.
మరోవైపు విపక్షాల వాదన ఎలా ఉన్నా తాము మాత్రం సెంట్రల్ విస్టా ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొంటున్నామని ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
“రాష్ట్రపతి భారత దేశానికి అధిపతి. పార్లమెంటు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంది. రెండు సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకలు. ఇవి రాజ్యాంగం నుంచి తమ అధికారాన్ని పొందుతున్నాయి. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రతను, గౌరవాన్ని ప్రభావితం చేసే ఏదైనా సమస్యకు అతీతంగా ఉండాలి బీజేడీ విశ్విస్తుంది. అలాంటి సమస్యలపై సభలో చర్చజరుగుతుంది. అందువల్ల ఈ ముఖ్యమైన సందర్భంలో బీజేడీ భాగం అవుతుంది” అని సీఎం నవీన్ పట్నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు.