18వ లోక్‌సభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. గత రెండు పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన బీజేపీ ఇప్పుడు ఎన్డీయే మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది.
తాజా రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓం బిర్లానే మరోసారి కొనసాగించవచ్చని సమాచారం. ఈ పదవి కోసం వేర్వేరు పేర్లు వినిపించినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం ఆయన కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే బలరాం జాఖడ్ తర్వాత వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించినట్లు ఓంబిర్లా రికార్డులకెక్కుతారు.
ఈరోజు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. మహతాబ్ ఎంపికపై విపక్షాల అభ్యంతరం నేపథ్యంలో సభలో రగడకు ఆస్కారం ఉంది. ప్రొటెం స్పీకర్‌కు సహకరించే ప్యానెల్‌లో ఉండేందుకు విపక్షంలోని ముగ్గురూ విముఖత వ్యక్తపరిచిన నేపథ్యంలో వారిలో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్‌తో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం భేటీ అయ్యారు.