దేశంలో కల్తీ తేనె వివాదం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో 13 ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె కల్తీ అయిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ఇటీవల చేపట్టిన పరీక్షల్లో వెల్లడైంది. డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు తదితర కంపెనీలకు చెందిన తేనెలో కల్తీ జరిగిందని నిర్దారణ అయింది. కేవలం 5 బ్రాండ్లకు చెందిన తేనె మాత్రమే టెస్టులలో పాస్ అయింది. మొత్తం 22 శాంపిల్స్ ను పరీక్షించాక ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ఈ వివాదంపై తేనె తయారీ కంపెనీలు స్పందించాయి. ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. ఎన్ఎంఆర్ మెషిన్ ద్వారా ఎప్పటికప్పుడు తాము తమ తేనెకు క్వాలిటీ టెస్టులు చేస్తున్నామని, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను తమ తేనె కలిగి ఉందని.. అందువల్ల తమ తేనెలో కల్తీ జరగలేదని డాబర్ ట్వీట్ చేసింది.
ఇక ఈ వివాదంపై అటు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ కూడా స్పందించారు. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అబద్దమన్నారు. ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతుందన్నారు. జర్మన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకున్నారని, తమ తేనె అసలైందేనని అన్నారు.
కానీ సీఎస్ఈ మాత్రం తాము జరిపిన పరీక్షలకు, వెల్లడించిన ఫలితాలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని వెల్లడించింది. మరి ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.