పిల్లలను పక్కవారితో పోల్చి ఇబ్బంది పెట్టొద్దు.. పరీక్షా పే చర్చలో మోదీ

-

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దిల్లీలోని భారత మండపంలో విద్యార్థులతో మాట్లాడారు. ఏడేళ్లుగా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షలు రాసే చిన్నారులకు ప్రధాని సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా విద్యార్థులు చూసుకోవాలని సూచించారు. పరీక్షల వేళ తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెంచకూడదని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చూడాలని కోరారు.

“రోజుకు 15 గంటలు చదవాలని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పరీక్షల ఒత్తిడి అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సొంత పద్ధతులు పాటించాలి. చదివే సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. రాత్రి నిద్ర పోకుండా చదవడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. పిల్లలను వారి స్నేహితులతో పోల్చి ఇబ్బంది పెట్టడం సరికాదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్లాలి. పిల్లల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. పక్కవారితో పోల్చడం వల్ల పిల్లల్లో అసూయ, ద్వేషాలు పెరుగుతాయి.” అని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news