కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కాలనీల్లో నడుచుకుంటూ ప్రజలను కలిసిన కిషన్‌రెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా మల్లెపల్లి డివిజన్‌లోని అఘాపురలో పవర్ బోర్‌ను ఆయన ప్రారంభించారు.
అయితే కిషన్ రెడ్డి వచ్చారని తెలియగానే స్థానికులు ఆయన వద్ద గుమిగూడి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆర్నెళ్లుగా వీధి దీపాలు లేవంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. నవంబర్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఇప్పటికే రెండు మూడు సార్లు ఫిర్యాదు చేశామని చెప్పారు. లైట్లు లేకపోవడంతో రాత్రి పూట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ముఖ్యంగా తమ ఆడపిల్లలు రాత్రి పూట బయటకు రావాలన్నా.. బయటి నుంచి ఇంటికి వచ్చే క్రమంలోనూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై ఆరా తీసిన కేంద్ర మంత్రి అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. నిధులు లేవంటూ అధికారులు సమాధానం ఇవ్వటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కిషన్‌రెడ్డి కాలనీల్లో వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.