కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే 300కిపైగా మరణించారు. మరో 131 మంది ఆచూకీ గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సెర్చ్ టీమ్‌లో బాధితుల బంధువులు, ప్రాణాలతో బయటపడిన వారిని భాగస్వామ్యం చేశారు. స్థలాలు, ప్రదేశాలను గుర్తించేందుకు ప్రతి పునరావాస కేంద్రం నుంచి నలుగురుని సెర్చ్ టీమ్‌లో చేర్చుకుని వారి కోసం గాలిస్తున్నారు.
మరోవైపు ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం వయనాడ్లో మోదీ విహంగ వీక్షణం చేయనున్నారు. ప్రకృతి విలయంతో విలవిల్లాడిన ఆ ప్రాంతంలో పరిస్థితులను తెలుసుకోనున్నారు. బాధితుల కష్టాలపై ఆరా తీయనున్నారు. సహాయక చర్యల గురించి అధికారులు మోదీకి వివరించనున్నారు. ఇంకోవైపు వయనాడ్ జిల్లాలోని వైతిరి తాలుకా, అంబలావయాల్ గ్రామంలో భూమి లోపల నుంచి వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు చెప్పారు. వెంటనే గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.