రేపు అంతర్జాతీయ యోగా డే… పాల్గొననున్న మోదీ

న్యూఢిల్లీ: సోమవారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ప్రధాని మోదీ యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని మోదీతో పాటు శ్రీశ్రీ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్‌తో సహా 15 మంది అధ్యాత్మిక వేత్తలు, యోగా గురువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తొలుత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మిగిలిన వారు సందేశాలు వినిపించనున్నారు.

యోగాతో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని మోదీ తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసమే యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రపంచంలోని 190 దేశాల్లో యోగా దినోత్సవాలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డే నిర్వహిస్తున్నారు. ఏడో అంతర్జాతీయ యోగా డేగా ఈ సారి నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కారణంగా వర్చువల్ విధానంలో ఈ యోగా డే కార్యక్రమం జరగనుంది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో యోగా చేసి సంఘీభావం తెలపాలని మోదీ ట్విట్టర్ ద్వారా పిలుపు నిచ్చారు.